Tada:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసిందని, ఇది ప్రజల విశ్వాసానికి చేసిన వెన్నుపోటేనని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహిస్తున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Tada: మండల అధ్యక్షుడు కెలవి ఆర్ముగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంజీవయ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేద కుటుంబాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అనంతరం వాటి అమలును పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజల్లో భారీ ఆశలు కల్పించిన పాలకులు, రెండేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రభుత్వ ధర్మమని, అయితే ప్రస్తుత పాలకులు ఆ బాధ్యతను విస్మరించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారని అన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తోందని, మహిళలు ప్రభుత్వ హామీల అమలుపై తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు.
Tada: ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన హామీ పత్రాలు ఇప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉన్నాయని, వాటి అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన రోజు తప్పక వస్తుందని హెచ్చరించారు. అనంతరం సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన కరపత్రాలను తడ నడిబజారులో దహనం చేసి నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, వాసు, రాజ్‌కుమార్, తిరుమలరెడ్డి, మురుగన్, ఆర్.కే. సుందర్‌రెడ్డి, పరమశివం రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, ప్రకాష్, మునుస్వామి రెడ్డి, జె.డి. రాజు, వైఎస్సార్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
HYDERABAD WEATHER Hyderabad WEATHER