Parliament Sessions: మన దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే మూడు బిల్లులు ఒకేసారి పార్లమెంట్ ముందుకు వచ్చాయి. మూడు రోజుల పాటు ఈ బిల్లులపై చర్చకు షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకూ పార్లమెంట్ ప్రత్యెక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో మూడు బిల్లులు ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో అందరిలోనూ అనేక సందేహాలు. అసలు ఇంత అర్జెంట్ గా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి.. ఈ బిల్ల్లులను చట్టాలుగా చేయాల్సిన అవసరం ఏముంది? అనేది వాటిలో ప్రధానమైనది. ఇది కాకుండా అసలు ఆ మూడు బిల్ల్లులు ఏమిటి? వీటివలన ప్రజలకు ఉపయోగం ఏమిటి? రాజకీయంగా వచ్చే మార్పులు ఏమిటి? ఈ బిల్లులను విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ బిల్లులు ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం పొండుతాయా? ఇలాంటి ప్రశ్నలన్నిటికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..
దానికంటే ముందు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మూడు బిల్లులు ఏమిటో ఒకసారి చూద్దాం.
- రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026
- డీలిమిటేషన్ బిల్లు, 2026
- కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026
ఈ మూడు బిల్లులను పాస్ చేయడం కోసమే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం అవుతోంది. వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026: 2027 జనాభా లెక్కల కోసం వేచి ఉండకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి, తద్వారా దానిని 2029 ఎన్నికల నుంచే ప్రారంభించవచ్చు. దీని కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలి.
డీలిమిటేషన్ బిల్లు, 2026: ప్రస్తుతం పార్లమెంటులోని సీట్ల సంఖ్యను 550కి పరిమితం చేసే ఆర్టికల్ 81(1) సవరణ. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లతో లోక్‌సభ బలాన్ని 850కి పెంచడానికి ఈ మార్పు చేయడం అవసరం.
కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026: ఈ బిల్లు ఉద్దేశ్యం ఆర్టికల్ 82ను తొలగించడం. ఈ ఆర్టికల్ ప్రతి జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనను తప్పనిసరి చేస్తుంది. దీనిని తొలగించడం ద్వారా, ప్రభుత్వం తన అవసరాలకు, కాలపరిమితికి అనుగుణంగా, పునర్విభజనను సరళంగా మార్చాలని కోరుకుంటోంది.
ఈ బిల్లులన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. అందుకే మూడిటినీ ఒకేసారి పార్లమెంట్ ముందుకు తీసుకువస్తున్నారు. వీటిలో మహిళా బిల్లు గురించి ఇప్పుడు చూద్దాం..
మూడేళ్ళ క్రితం ఆమోదం పొందినా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలుకు నోచుకోలేదు?
కేంద్ర ప్రభుత్వం 19 సెప్టెంబర్ 2023న రాజ్యాంగ (128వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, లోక్‌సభ- రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేసే నిబంధన ఉంది.
2023 సెప్టెంబర్ 20న లోక్‌సభ, సెప్టెంబర్ 21న రాజ్యసభ, సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారింది. అయినప్పటికీ, ఇది అమలు కాలేదు. ఎందుకంటే, కొత్త జనాభా లెక్కలు, తదుపరి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని ఆ చట్టం నిర్దేశించింది. కొత్త జనాభా లెక్కల నుండి డేటా రావడానికి మరో రెండు సంవత్సరాలు పట్టవచ్చు. దీని అర్థం, నియోజకవర్గాల పునర్విభజన 2034 ఎన్నికల వరకు ఆలస్యం కావచ్చు. అంటే ఆ ఎన్నికల వరకూ కూడా మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి వచ్చే చాన్స్ లేదు. 2029 ఎన్నికల్లోనే దీనిని అమలు చేయాలంటే దానికి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో మార్పులు చేయడం అవసరం. అందుకే ఇప్పుడు ప్రత్యెక సమావేశాలు ఏర్పాటు చేసి దీనికి ఆమోదం పొందాలని కోరుకుంటోంది.
ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏమిటి?
మహిళా బిల్లు అమలు కోసం ఇప్పుడే తొందరేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్ జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఇలా తొందరపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే, మహిళల ఓట్ల ధోరణిని 10% మేర మార్చగలిగితే, 3-4% తేడాతో ఎన్నికలు గెలిచే చోట, 1-2% అదనపు ఓట్లు కూడా ఫలితాన్ని మార్చేయగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవిధమైన ఆలోచనలతోనే ఇప్పుడు బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది.
“ఈ బిల్లు 2023లో ఆమోదించి చట్టంగా మారింది. ఇప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని పార్లమెంట్ హామీ ఇచ్చింది. ఈ హామీని వీలైనంత త్వరగా నెరవేర్చాలి” అంటూ ప్రభుత్వం తరఫున హోమ్ మంత్రి అమిత్ షా చెబుతున్నారు.
డీలిమిటేషన్ బిల్లు పై ఎందుకు వివాదం?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు డీ లిమిటేషన్ బిల్లు ఎందుకు అనే విషయాన్ని తెలుసుకోవాలి. 1952లో భారతదేశపు తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంటులో 489 సీట్లు, సుమారు 36 కోట్ల జనాభా ఉండేది. నేడు, జనాభా 140 కోట్లను దాటింది. కానీ, గత 50 ఏళ్లుగా సీట్ల సంఖ్య 543 వద్దే ఉండిపోయింది. ప్రస్తుత సీట్ల పంపిణీ 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. ఆ సమయంలో, ఒక ఎంపీ సగటున 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 25 లక్షలకు పైగా పెరిగింది. అందుకే లోక్ సభ స్థానాలను పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రతిపక్షాలు దీని విషయంలో చెబుతున్న తీవ్రమైన అభ్యంతరం ఒక్కటే. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే.. దక్షినాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ భయం కొత్తది కాదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య జనాభాలో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా 1976, 2001 సంవత్సరాలలోనూ నియోజకవర్గాల పునర్విభజన వాయిదా పడింది.
అవే ఆందోళనలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అవలంబించి, తమ జనాభాను అదుపులో ఉంచుకున్నాయి. కానీ జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన వాటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించవచ్చు.
- నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రానికి నష్టం కలిగిస్తే, 1950-60వ దశకంలో జరిగినటువంటి ఉద్యమం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐక్యతను కోరుతూ, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరుతూ దక్షిణాది ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశారు.
ఎన్నికల విశ్లేషకుడు , రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ చెబుతున్నప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు నష్టపోతాయి. అయితే హిందీ మాట్లాడే రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. ఇది సమాఖ్య నిర్మాణంలోని సున్నితమైన సమతుల్యతను దెబ్బతీయగలదు.
ఈ అభ్యంతరాలపై కేంద్రం స్పందించింది. రాష్ట్రాల దామాషా వాటాలో ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్ర ప్రభుత్వం పదేపదే హామీ ఇచ్చింది. సీట్ల కేటాయింపును డీలిమిటేషన్ కమిషన్ చేస్తుందని, అది దామాషా ప్రాతినిధ్యం ఆధారంగా ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాదికి నష్టమేమీ జరగదు. ప్రయోజనమే చేకూరుతుందనేది ఆయన వాదన .
అనుపాత ప్రాతినిధ్యం అంటే, లోక్‌సభలో రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత సీట్ల వాటా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో సీట్లను కేటాయించడం. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశంలో ఉన్న మొత్తం 543 సీట్లలో ఏపీ వాటా 4.60% {(25/543)x 100}. లోక్‌సభ సీట్లు 543 నుండి 850కి పెరిగితే, ఈ సూత్రాన్ని ఉపయోగించి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభ సీట్లు 39కు చేరుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు, ఇది కేవలం 13.6% మాత్రమే. 543 సీట్లకు 33% రిజర్వేషన్ అమలు చేస్తే, 181 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. చాలా మంది పురుష ఎంపీలు తమ సీట్లను వదులుకోవలసి వస్తుంది. ఇది పార్టీలలో తిరుగుబాటుకు దారితీసే ప్రమాదం ఉంది.
అయితే, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 816 సీట్లు ఉంటాయని అంచనా. అంటే 273 కొత్త సీట్లు యాడ్ అవుతాయి. సుమారుగా అన్నే సంఖ్యలో సీట్లు మహిళల కోసం రిజర్వ్ అవుతాయి. దీనివల్ల ఇప్పటికే ఉన్న పురుష ఎంపీలపై ప్రత్యక్ష ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయినా, కానీ ప్రతిపక్షాలు డీలిమిటేషన్ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారి ప్రధాన ప్రశ్న ఒక్కటే ఇంత అర్జంట్ గా ఎందుకు? అనేది.
అసలు డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
మొదట ఒక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్‌గా ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు శాసనసభ సభ్యులు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు. అయితే, ఈ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
భారతదేశపు గత నాలుగు డీలిమిటేషన్ కమిషన్లు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి మూడు నుండి ఐదున్నర సంవత్సరాల సమయం తీసుకున్నాయి. 2002లో ప్రారంభమైన డీలిమిటేషన్ ప్రక్రియ, ఆరు సంవత్సరాల వ్యవధిలో 2008లో పూర్తయింది.
ప్రభుత్వం తొందర అందుకే..
2029 లోక్‌సభ ఎన్నికల నాటికి డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్..వీటన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఎన్నికతో రిజర్వ్డ్ సీట్లు మారుతూ ఉంటాయి. ఎస్సీ/ఎస్టీ కోటా సీట్లలో మూడింట ఒక వంతు ఆ కేటగిరీలోని మహిళలకు కూడా రిజర్వ్ చేస్తారు. అందుకోసమే అత్యవసరంగా ఈ బిల్లులు తీసుకువస్తోంది. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రాష్ట్రాల శాసనసభల్లో కూడా మహిళా రిజర్వేషన్ వర్తిస్తుంది. నారీ శక్తి వందన చట్టం (106వ రాజ్యాంగ సవరణ చట్టం, 2023) ప్రకారం, లోక్‌సభలోనూ, అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలోనూ మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి.
అస్సాం, జమ్మూ కాశ్మీర్ మినహా, చాలా రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలు 2001 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అనే నాలుగు ఈశాన్య రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలు ఇంకా పాతదైన 2001 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. అందువల్ల, ఈ ప్రాంతాలలో కూడా కొత్త నియోజకవర్గాల పునర్విభజన అవసరం అవుతుంది.
ఇవన్నీ 2029 ఎన్నికలలోపు పూర్తి చేయాలంటే, చట్ట సవరణలు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వ వాదన.
మొత్తంమీద చూస్తె.. ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఇటు ప్రభుత్వ పట్టుదలకు.. అటు విపక్షాల అభ్యంతరాలకు మధ్య పోరుగా చెప్పుకోవచ్చు. ఈ బిల్లులు ఏమేరకు ఈ సమావేశాల్లో ముందుకు వేళతాయనేది మరో మూడురోజుల్లో తేలిపోనుంది.
HYDERABAD WEATHER Hyderabad WEATHER