Visakhapatnam:  చిన్నారులకు జంక్ ఫుడ్ హానికరం..అక్కయ్యపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం

Visakhapatnam

Visakhapatnam:  విశాఖపట్నం అక్కయ్యపాలెం చాకలి గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం  పోషకాహారం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు జంక్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరంగా తెలియజేశారు. ICDS సూపర్‌వైజర్ టి. సత్యవతి పాల్గొని తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు అందించారు.

ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ, జంక్ ఫుడ్ చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఈ ఆహారం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, శరీరంలో చక్కెర – ఉప్పు శాతం అధికమవుతుందని వివరించారు. దీని కారణంగా పిల్లల్లో పోషకాల లోపం ఏర్పడి, అధిక బరువు నుంచి కాలేయ సమస్యల వరకు పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని తెలిపారు.

ఇంకా జంక్ ఫుడ్ ప్రభావంతో పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోవడం, చిరాకు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయని ఆమె వివరించారు. ఈ సమస్యలు వారి విద్యా పురోగతిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు. అందువల్ల చిన్న వయస్సులోనే సరైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయడం అత్యంత అవసరమని సూచించారు.

తల్లిదండ్రుల పాత్ర ఈ విషయంలో కీలకమని సత్యవతి పేర్కొన్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు తగ్గించాలంటే ముందుగా తల్లిదండ్రులలో అవగాహన రావాలని అన్నారు. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారాన్ని ఆకర్షణీయంగా అందిస్తే పిల్లలు సహజంగానే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతారని తెలిపారు.

పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి పోషకాహారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వివరించారు. రోజువారీ ఆహారంలో సమతుల్యత ఉండేలా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తతో పాటు స్థానిక గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో మరింత చైతన్యం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం పిల్లలకు పోషకాహారం విషయంలో ర్యాలీ నిర్వహించారు.

HYDERABAD WEATHER Hyderabad WEATHER