Sing geetham movie review: నలభై ఏళ్లయినా కథలో అదే పచ్చదనం.. తొమ్మిది పదులు దాటినా కథనంలో తగ్గని కొత్తదనం ఈ సింగీతం!

Sing Geetham Review

సింగీతం శ్రీనివాసరావు తాజా సినిమా సింగ్ గీతం ప్రేక్షకులను మెప్పించిందా ? సినిమా ఎలా ఉందంటే . .

Sing geetham movie review: సింగీతం శ్రీనివాసరావు ఈ పేరు వినగానే మనకి ఠక్కున ఆదిత్య 369 గుర్తుకువస్తుంది. ఇంకొంచెం ఆలోచిస్తే పుష్పకవిమానం.. విచిత్ర సోదరులు.. మైఖేల్ మదన  కామరాజు,  భైరవద్వీపం ఇలా వరుసపెట్టి వేటికవే భిన్నమైన కథ కథనాలతో మనల్ని మెప్పించిన సినిమాలన్నీ మన కళ్ల ముందు మెదులుతాయి. ఆయనెప్పుడో 40 ఏళ్ల క్రితం ఒక కథ రాసుకున్నారట. దానిని కమల్ హాసన్ తో సినిమాగా తీయాలని అనుకున్నారట కానీ, ఎందుకో వీలుపడలేదు. అయితే, అదే కథని ఇప్పుడు సింగ్ గీతం పేరుతో కొత్త నటీనటులతో తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు సినిమా అంటేనే వెరైటీ తప్పదు. ఆదిత్య 369 టైమ్ ట్రావెల్.. మాటల్లేని పుష్పకవిమానం.. ఇలా కచ్చితంగా కొత్తదనం కనిపించాల్సిందే సింగీతం సినిమాల్లో. అదిగో అదే పంథాలో మన ముందుకు వచ్చింది సింగ్ గీతం. తనపేరునే ధ్వనించే టైటిల్ తో మూవీ వస్తోంది అనగానే  సినీ అభిమానులు కచ్చితంగా మరో వైవిద్యభరితమైన సినిమా చూడబోతున్నాం అని అనుకున్నారు. మరి వారి అంచనాలను సింగ్ గీతం అందుకుందా? 

కథ ఇలా . .

Sing geetham movie review: సింగీతం సినిమాలంటేనే అనగనగా చందమామ కథల్లా ఉంటాయి. ఇదీ అంతే అనగనగా ఒక కుబేరపురం అనే గ్రామం. ఆ గ్రామంలో బంగారం గనులను ఓ తండ్రీ, కూతురు తమ అధీనంలో ఉంచుకుని అక్కడి బంగారాన్ని అమ్మేయడానికి ప్లాన్స్ వేస్తారు. ఇక అదే ఊరిలో తన పూర్వీకుల ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్న ఒక యువకుడు అక్కడికి వస్తాడు. అయితే, తన అస్తుల్లోనే బంగారు గనులు ఉన్నాయని తెలుసుకున్న అతగాడు మైనింగ్ చేస్తున్న తండ్రీ, కూతుళ్లతో జతకడతాడు. ఇక అదే ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దానిని అమ్మలా చూసుకునే ఒక అమ్మాయి ఉంటుంది. మైనింగ్ ముఠా ఆప్రాంతంలో చెట్లన్నీ నరికేస్తారు. ఈ ఒక్క చెట్టే మిగిలి ఉంటుంది. ఆ చెట్టును కూడా కొట్టేయాలని చూస్తారు. కానీ ఆ అమ్మాయి అడ్డుకుంటుంది. అయినాసరే ఆమెను పక్కకు లాగేసి చెట్టును నరికేస్తారు మైనింగ్ ముఠా. దీనికి ఊరివాళ్లంతా సపోర్ట్ చేస్తారు. విచిత్రంగా చెట్టును నరికేసిన తరువాతి రోజు ఊరిలో ఉన్న వారందరికీ మాట పడిపోయి పాట వచ్చి చేరుతుంది. ఏమిటీ అర్ధం కాలేదా? ఊరి జనం ఏమి మాట్లాడినా అది పాటలానే వస్తుంటుంది. దీంతో ఊరంతా భయపడిపోతుంది. అసలు అలా పాటలా మాట మారిపోవడం ఏమిటో? ఆ చెట్టును కాపాడుకోవాలని ప్రయత్నించినా అమ్మాయి, తన ఆస్తుల కోసం అని వచ్చిన అబ్బాయికి మధ్య సంబంధం ఎలాంటిదో? మైనింగ్ ముఠా ప్రయత్నాలు ఫలించాయో లేదో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సింగ్ గీతం. 

ఎలా ఉందంటే..

అసలు మాటలాడితే పాటలా బయటకు వినిపించడం అనే థాట్ ఒక అద్భుతం. మీరొకసారి ఊహించండి. ఇంట్లో అందరూ మాట్లాడుతుంటే పాటలా వినిపిస్తోందనుకోండి ఎలా ఉంటుంది? మరి అదే ఊరు ఊరంతా ఇలానే జరిగితే ఆ గందరగోళం విచిత్రంగా ఉంటుంది కదా. అసలు ఇలాంటి కథ చందమామ పుస్తకంలో చదివితే అద్భుతంగా ఉంటుంది. కానీ, సినిమాగా వస్తే ఎలా ఉంటుంది? వేరేఎవరైనా దర్శకుడు అయితే ఏమయ్యేదో ఏమో కానీ, ఇక్కడ సింగీతం శ్రీనివాసరావు. ఇలాంటి వెరైటీలను తెరకెక్కించడంలో ఘనాపాటి. అదిగో మళ్ళీ తన మేజిక్ చూపించేశారు సింగీతం. ఆయన వయసు 94 ఏళ్ళు. కానీ, ఇప్పుడు కూడా తన కథను సినిమాగా మలిచి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంటున్న నిత్యనవ దర్శకుడు.   ఇలాంటి క్లిష్టమైన కథను ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయేలా చెక్కారు సింగీతం. ఈ సినిమాలో వెరైటీ మాత్రమే కాదు.. ఈ తరానికి చెట్ల గొప్పదనాన్ని.. ప్రకృతి లో పచ్చదనం లేకపోతె వచ్చే భయానక పరిస్థితుల్ని.. చెట్లను ప్రేమించాలనే చిక్కటి సందేశాన్ని ఇమిడ్చి అద్భుతం చేశారు సింగీతం. 

Sing geetham movie review: ఈ సినిమాకి సింగీతం దర్శకుడు అయితే, నాగ్ అశ్విన్ దీనిని సమన్వయ పరిచారు. ఇక సింగీతం శ్రీనివాసరావుతో పాటు సినిమా విషయంలో చెప్పుకోవలసింది దేవి శ్రీ ప్రసాద్. మాటలనే పాటలుగా చూపించడం అనే ఊహకి తన సంగీతంతో ప్రాణం పోశాడు దేవిశ్రీ. సినిమా మొదటి 20 నిమిషాల తరువాత నుంచి ప్రతి పాత్రా పాడుతూ మాట్లాడుతుంది. దానికి బీజీఎమ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరి మాట (సారీ.. పాటలోనూ) దేవిశ్రీ కనిపిస్తారు. చక్కటి కథ.. కథనం.. దానికి మంచి సంగీతం తోడైతే ఇదిగో ఇలా సింగ్ గీతం లా థియేటర్లో  మారుమోగుతుంది. 

ఎవరెలా చేశారంటే . .

ఇక సినిమాలో నటీనటుల గురించి చెప్పుకోవాల్సి వస్తే దాదాపుగా అందరూ కొత్త వాళ్లే. కొందరు పాత నటులున్నా.. ఎక్కడా వారు కనిపించరు. వారి పాత్రలే కనిపిస్తాయి. చెట్టులో  అమ్మను  చూసుకునే అమ్మాయి గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉండే ఆస్తి కోసం ఊరికి వచ్చే అబ్బాయి ప్రతాప్‌ పాత్రలో అయాన్‌, మైనింగ్ ముఠాలో తండ్రిగా బెనర్జీ,  కూతురుగా  రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. వారి పాత్రలే సినిమా కథకు చుక్కాని. అలా సీనియర్‌ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. ఇక మిగిలిన వారు కూడా  బాగా చేశారు.

Sing geetham movie review: మొత్తంగా చూస్తే సింగ్ గీతం కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా చూడగలిగిన మంచి సినిమా. చాలాకాలం తరువాత తెలుగుదనం కనిపించిన సినిమా. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టు లాజిక్ ల కోసం లేదా లాగ్ ల కోసం మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, సమాజానికి పనికివచ్చే ఒక సందేశాన్ని వినోదాత్మకంగా.. బలంగా ప్రేక్షకుల హృదయాలకు పట్టేలా చెప్పిన సినిమా ఇది. 

చివరగా ఒక మాట నేను సినిమా చూసిన థియేటర్ లో సినిమా చివరిలో సింగీతం శ్రీనివాసరావు టైటిల్ పడినపుడు ప్రేక్షకులు నిలబడి కొట్టిన చప్పట్లే సినిమా ఎలా ఉందో చెప్పేశాయి. ఇలాంటి సినిమాలకు రేటింగ్స్ ఉండవు. వెళ్లి చూసి చప్పట్లు కొట్టేయడమే!

HYDERABAD WEATHER Hyderabad WEATHER