Mana Shankara Vara Prasad Garu Review: చిరంజీవి సినిమా అంటేనే ఒక రకమైన వైబ్ ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి గురించి చెప్పే పనే లేదు. వీరిద్దరి కలయికలో ఒక మూవీ వస్తోంది అన్నపుడే ప్రేక్షకుల్లో ఒక ఇంట్రస్ట్ క్రియేట్ అయిపొయింది. ఇక సినిమా ముహూర్తం దగ్గర నుంచి అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ మూవీ మీద మెల్లగా అంచనాలు పెంచుతూ వచ్చేశాయి. పండక్కి వస్తాము అని అనిల్ చెప్పినా.. చాలామందిలో పెద్ద డౌట్ చిరంజీవి సినిమా అనుకున్నట్టుగా ఎప్పుడు పూర్తవుతుంది.. అనిల్ కు ఈసారి సంక్రాంతి మూవీ కష్టమే అని అనుకున్నారు. ఇక మూవీలో వెంకటేష్ ఉన్నారని తెలిసిన తరువాత అబ్బో రావిపూడి ఎదో మేజిక్ చేసేలా ఉన్నాడని ఫిక్స్ అయిపోయారు. ఇదిగో అనిల్ రావిపూడి చెప్పిన సంక్రాతి వచ్చింది. సినిమా రిలీజ్ అయిపొయింది. మరి తానే ప్రచారం చేసినట్టు రఫ్ ఆడించారా? ఒక్క హుక్ స్టెప్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన పరిస్థితి సినిమాలో కనిపించిందా? చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్ ఎలా ఉంది? ఎప్పుడూ ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టే నయనతార ప్రచార వీడియోలకు రావడం వర్కౌట్ అయిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
శంకర వర ప్రసాద్(Mana Shankara Vara Prasad Garu story) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర హోమ్ మంత్రి దగ్గర రక్షణ బాధ్యతల్లో ఉటుంది ఆయన టీమ్. అతను పెద్ద బిజినెస్ మేన్ కూతురు శశిరేఖను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్లపాటు ఇద్దరి సంసారం చక్కగానే సాగుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె తండ్రి జీవీఆర్ వీరుఇద్దరినీ విడదీస్తాడు. పిల్లలను కూడా తండ్రి దగ్గరకు వెళ్లకుండా చేస్తాడు. పైగా వాళ్లలో తండ్రి అంటేనే విపరీతమైన ద్వేషం పెరిగేలా చూస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వర ప్రసాద్ పిల్లల విషయంలో బాధతో ఉంటాడు. విషయం తెలుసుకున్న మంత్రి నితీష్ తనకున్న పలుబడితో బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. మరి శంకర వర ప్రసాద్ పిల్లల్లో తనపై ద్వేషాన్ని ఎలా పోగొట్టాడు? అసలు భార్యతో ఆటను విడిపోవడానికి కారణం ఏమిటి? కర్ణాటక నుంచి వెంకీ గౌడ్ ఎందుకు వస్తాడు? అతనికీ శశిరేఖకి మధ్య సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ.
ఎలా ఉందంటే..
Mana Shankara Vara Prasad Garu Review: అనిల్ రావిపూడి సినిమా అంటేనే కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు కథ అనేదే కనపడదు. ఒక సింపుల్ లైన్ కి ఆయన ఎంచుకున్న హీరోకి తగినట్టుగా సీన్స్ అల్లుకుని.. ఆ హీరో ఇమేజ్ ని జాగ్రత్తగా వాడుకుంటూ.. రెండున్నర గంటల పాటు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా స్క్రీన్ ప్లే తో ఆదుకుంటారు. ఈ మూవీ కూడా అంతే. చిరంజీవి రాజకీయాల నుంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఆయనలోని కామెడీ టైమింగ్ ని వాడుకున్న సీనియా ఏదీ రాలేదు. అసలు చిరంజీవి అంటేనే గుర్తుకు వచ్చే డ్యాన్సులు కూడా అదరగొట్టే స్థాయిలో ఉన్న మూవీ ఏదీ లేదనే చెప్పాలి. చిరంజీవి ఎలా ఉంటే.. ఎలా కనిపిస్తే అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అవుతారో సరిగ్గా ఆ పాయింట్స్ అన్నిటినీ బీభత్సంగా వాడేశారు అనిల్. మూవీ స్టార్టింగ్ లోనే ఫామిలీ మ్యాన్ గా చిరుని పరిచయం చేసి తరువాత ఆయన కామెడీ టైమింగ్ తోనే సూపర్ ఎలివేషన్స్ ఇస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్.. హుక్ స్టెప్ సాంగ్ తో చాల వేగంగా ప్రేక్షకులను సినిమాలోకి తీసుకుపోతారు. ఇక అక్కడ నుంచి సినిమా అంతా పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అనిల్ మార్క్ తో మూవీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇంటర్వెల్ తరువాత కొద్దిసేపు సినిమా కాస్త స్లో అవుతుంది. ల్యాగ్ అని చెప్పలేం కానీ, కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే, వెంకీ గౌడ్ గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మూవీ మళ్ళీ పరుగులు తీస్తుంది. అంతే వేగంగా మూవీముగుస్తుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి పైసా వసూల్ మూవీ అనే అనుభూతిని ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఇది చిరంజీవి సినిమా. సరైన కథనం దొరకాలి.. అవకాశం ఉండాలి కానీ చిరంజీవి(Chiranjeevi Latest Movie Review) కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదని అందరికీ తెలిసిందే. చాలా కాలం తరువాత చిరు ఫాన్స్ కి బ్రహ్మాండమైన పెస్టివల్ వచ్చింది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్ లో తనదైన స్టైల్ లో ఒదిగిపోయారు. ఇక డాన్స్ ల గురించి చెప్పక్కర్లేదు. టీజర్స్.. ట్రైలర్స్.. వీటిలో చూపించిన దానికన్నా అద్భుతంగా సాంగ్స్ లో చిరంజీవి కనిపిస్తారు. హుక్ స్టెప్ కానీయండి.. శశిరేఖా అయినా.. వెంకీతో ఫెస్టివ్ సాంగ్ అయినా అన్నిటిలోనూ చిరంజీవి మార్క్ డ్యాన్స్ కనిపిస్తుంది. అసలు చిరంజీవి లుక్కే చాలా బావుంటుంది. ఇక నయనతార గురించి చెప్పాల్సిన పనిలేదు. శశిరేఖగా సరిగ్గా ఇమిడిపోయింది. ఆమె ప్రతి కనిపించిన ప్రతి సీన్ చాలా నీట్ గా ఉంది. ఆమె కోసమే ఆ సీన్స్ రాసుకున్నట్టు అనిపిస్తాయి. చాలా చోట్ల ఆమెఎక్స్ ప్రెషన్స్ తోనే ఆకట్టుకుంటుంది. వెంకటేష్.. వెంకీ గౌడ్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన వచ్చిన తరువాత చిరంజీవికి. ఆయనకు మధ్య ఉన్న సీన్స్ లో ఒకరి పాటకు ఒకరు స్టెప్స్ వేస్తూ సందడి చేయడం.. చిరంజీవితో పాటు డ్యాన్స్.. యాక్షన్ సీన్స్ మినీ మల్టీ స్టారర్ కి ఎలా ఉండాలో అలా కనిపించారు వెంకీ. ఇక మిగిలిన వారంతా వాళ్లకున్న అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. అన్నట్టు అనిల్ ఫేవరేట్ బుల్లిరాజు కొద్దిసేపు కనిపించినా కడుపుబ్బా నవ్వించేశాడు.
టెక్నీకల్ గా ఎలా ఉందంటే..
Mana Shankara Vara Prasad Garu Review : ముందే చెప్పినట్టు ఇది అనిల్ రావిపూడి సినిమా. ప్రేక్షకుడ్ని రెండున్నర గంటల సేపు థియేటర్లో ఎలా కూచోపెట్టాలి అనేదే ఆయన టార్గెట్. ఆ టార్గెట్ కచ్చితంగా రీచ్ అయ్యారు. తన సంక్రాతి సినిమా కోసం స్పెషల్ అభిమానులున్నారు. అలాగే ప్రేక్షకులు అనిల్ సంక్రాంతి మూవీ అంటే చాలా ఎగ్జైట్ గాఎదురుచూస్తారు. వారందరినీ ఎక్కడా నిరాశ పరచలేదు. చిరంజీవి టైమింగ్ ని వాడుకోవడంలో అనిల్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు కనిపించింది. చాలామంది ఇప్పటికే చెప్పినట్టు ఒక జంధ్యాల+ఒక ఈవీవీతో పాటుగా కోదండరరామిరెడ్డి, రాఘవేంద్ర రావులను మిక్స్ చేస్తే అనిల్ రావిపూడి. అంతేకాదు మూవీలో ఎక్కడా కూడా అభ్యంతరకరమైన సన్నివేశం ఒక్కటీ లేదు. ఇలాంటి సినిమాల్లో అక్కడక్కడా డబుల్ మీనింగ్ కామెడీ కనిపించడం చాలా సహజం. కానీ, ఎక్కడా అలాంటి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అదీకాకుండా తక్కువ టైమ్ రన్ లోనే అవకాశం ఉన్న మేరకు మంచి సందేశాల్ని కూడా వినోదాత్మకంగా అందించారు. మహిళా చట్టాలను దుర్వినియోగం చేయడం.. భార్యా భర్తల మధ్యలో మూడో వ్యక్తి చేరితే ఎలా జీవితాలు పాడైపోతాయి.. లాంటి అంశాలను జాగ్రత్తగా మూవీలో జతచేసి అనిల్ మంచి మార్కులే కొట్టేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా 150 సినిమాలకు పైగా అనుభవం ఉన్న స్టార్ ని.. 70 సినిమాల వెనక్కి తీసుకువెళ్లి.. ఇప్పటి తరానికి కూడా నచ్చేలా లుక్స్ తీసుకురావడంలో అనిల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
ఇక ఫొటోగ్రఫీ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. సమీర్ ఫోటోగ్రఫీ ఎంత బావుంటుందంటే.. ప్రతి ఫ్రేమ్ అందంగా.. ఆహ్లాదంగా కనిపిస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్. చిరంజీవి పాత పాటల్ని.. ఆయన సినిమాల్లో బీజీఎమ్ ని కొత్తగా మిక్స్ చేసి వదిలేశారు. థియేటర్లను మోతెక్కించి.. చెవులను గింగిరాలు తిప్పేలా కాకుండా.. ప్రేక్షుకులను సీన్స్ లో మమేకం చేసేలా మ్యూజిక్ ఇచ్చారు. కొరియోగ్రఫీ, యాక్షన్ అన్నీ కూడా చిరంజీవి రేంజ్ లో ఉన్నాయి.
సినిమాలో లోపాలు లేవా అంటే ఉన్నాయి. కానీ, లాజిక్స్ వెతికే రేంజ్ నుంచి తెలుగు సినిమా ఎప్పుడో పక్కకు జరిగిపోయింది. అందులోనూ ఇలాంటి కామెడీ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో వాటి గురించి పట్టించుకోవడం అనవసరం. చిరంజీవి అభిమానులకు ఆయన వింటేజ్ లుక్స్.. సాధారణ ప్రేక్షకులకు కావలసిన వినోదం.. ఉన్నపుడు లాజిక్స్ గురించి ఆలోచించడం అనవసరం కదా!
మొత్తంగా చూసుకుంటే ఇది సంక్రాంతి సినిమా. ఇది అనిల్ రావిపూడి పండగ సినిమా. ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా. తెలుగు ప్రజలకు పెద్ద పండగ అంటేనే పిండివంటలు.. కోడి పందాలు.. రంగవల్లులు.. సినిమా! ఈ మూవీ పండగను తీసుకువచ్చేసింది. థియేటర్లలో చిరంజీవి వింటేజ్ జాతర మొదలైపోయింది.
చివరిగా అనిల్ రావిపూడి.. మన శంకర వరప్రసాద్ గారితో కలిసి పండక్కి మెగా వినోదాల విందు ఇచ్చేశారు.
గమనిక: ఈ విశ్లేషణలోని అంశాలు రచయిత అభిప్రాయలు మాత్రమే. ఈ సినిమా చూడండి అని కానీ, చూడొద్దు అని కానీ ఎవరికీ సూచించడం లేదు.
HYDERABAD WEATHER Hyderabad WEATHER