Environment Day 2026: మొక్క నాటితేనే కాదు..పెంచితేనే పర్యావరణానికి ప్రాణం

Environment Day 2026

మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

Environment Day 2026: మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిధిలోని తూకివాకం సమీపంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి కలిసి మొక్కలు నాటారు. 

Environment Day 2026: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. చెట్లను నాటడమే కాకుండా వాటికి నీరు పోయడం, ఎరువులు వేయడం, అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే అవి జీవించి పర్యావరణానికి మేలు చేస్తాయని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయని, భవిష్యత్తులో తీరప్రాంత ప్రజల జీవనోపాధులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సీడ్ పెల్లెట్స్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఆవుపేడ, జీవామృతం వంటి సహజ పదార్థాలతో విత్తనాలను గుళికల రూపంలో తయారు చేసి నాటడం ద్వారా మొక్కల జీవన శాతం పెరుగుతుందని వివరించారు. 

Environment Day 2026: శేషాచలం అటవీ ప్రాంతంలో అధికంగా ఉన్న చెట్ల వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని, అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందితే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ, చెట్లు నాటడాన్ని ఒక ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి పరిసరాలు, పాఠశాలలు, వ్యవసాయ క్షేత్రాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. చెట్లు నరికే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి బదులుగా కొత్త మొక్కలు నాటాలని సూచించారు. 

తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా యువత ముందుకు రావాలని కోరారు. కాలుష్య నివారణకు సౌరశక్తి వినియోగం, బ్యాటరీ వాహనాల ప్రోత్సాహం అవసరమని చెప్పారు. దేశ రక్షణలో సైనికులు చేస్తున్న సేవల మాదిరిగానే యువత తమ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

HYDERABAD WEATHER Hyderabad WEATHER