Mera yuva Bharat Run: భాగ్యనగరంలోని పీపుల్స్ ప్లాజా ఆదివారం ఉదయం యువశక్తితో ఉరకలెత్తింది. దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘మేర యువ భారత్ రన్’ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఈఓ యశస్వి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో వేలాది మంది పాఠశాల విద్యార్థులు, యువత మరియు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ స్ఫూర్తితో నిర్వహించిన ఈ పరుగును రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ భారీ ఫిట్‌నెస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ‘ది నైల్ మైల్’ వ్యవస్థాపకుడు అనంత్ సంజీవ్ దూగర్ సారథ్యంలో ఈ రన్ మూడు విభాగాలుగా (5 కి.మీ, 2 కి.మీ, 500 మీటర్లు) కొనసాగింది. కేవలం పరుగు మాత్రమే కాకుండా జుంబా, యోగా, మెడిటేషన్ వంటి కార్యక్రమాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మాతృభాషలోనే మాట్లాడండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో యువతకు దిశానిర్దేశం చేశారు. “యోగా అనేది కేవలం మోదీ కోసం కాదు, అది మీ బాడీ కోసం” అని ఆయన చమత్కరించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై స్పందిస్తూ, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అయితే మన జోలికి వస్తే ప్రతాపం చూపేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Mera yuva Bharat Run: మాతృభాష ప్రాముఖ్యతను వివరిస్తూ వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇంగ్లీష్ మనకు కళ్లద్దాల వంటిది, కానీ అమ్మ భాష చూపు వంటిది” అని పేర్కొన్నారు. నేటి యువత సంస్కృతిని విస్మరించకూడదని, ఇంట్లో వృద్ధులతో సమయం గడపాలని సూచించారు. జంక్ ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆరోగ్య సూత్రాలను వివరించారు.
యువతే దేశానికి నిజమైన ఆస్తి: కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యువతే దేశానికి నిజమైన ఆస్తి అని అభివర్ణించారు. వికసిత్ భారత్ కల సాకారం కావాలంటే యువత శారీరకంగా, మానసిక దృఢంగా ఉండాలని కోరారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. దేశ ప్రగతిలో ఫిట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.
శర్వానంద్ ఏమన్నారంటే . .
మరోవైపు, టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని యువతతో పంచుకున్నారు. తాను గతంలో జిమ్ వైపు కూడా వెళ్లలేదని, కానీ సంకల్పంతో రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గానని వెల్లడించారు. ప్రస్తుతం తాను నిరంతరాయంగా 11 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నానని, ఇది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
HYDERABAD WEATHER Hyderabad WEATHER