ముక్కోటి ఏకాదశి.. భక్తజన పరవళ్లు.. సందడిగా ఆలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా శ్రీమహా విష్ణువు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

భద్రాచలం  శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిచ్చారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజాము 3:30 గంటల నుంచే వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది.

ఈసారి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల పాటు సామాన్య భక్తులకు ఈ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.